ప్రఖ్యాత ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యులు 58వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలుగా ఎంపికయ్యారు. ఈ మేరకు సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతల ఎంపిక కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్ హిందీలో అనేక సినిమా పాటలను రాశారు. ఈయన ఉర్దూ కవిగా కూడా పేరు సంపాదించుకున్నారు.
ఈయన ఉర్దూ రచనలకుగానూ 2002లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్ అవార్డులు వరించాయి. వీటితోపాటు పలు జాతీయ చలనచిత్ర అవార్డులు ఆయనకు దక్కాయి.
రామభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసిపీఠం వ్యవస్థాపకుడు. ఈయన హిందూ ఆధ్యాత్మిక నాయకుడు. విద్యావేత్త. ఇప్పటివరకు ఆయన వంద కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు. ఉర్దూ, సంస్కృతం రెండు భాషలకు చెందిన ప్రముఖ రచయితలైన గుల్జార్, రామభద్రాచార్యలను ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించిందని జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
జ్ఞానపీఠ్ అవార్డును1944లో స్థాపించారు.భారతీయ సాహిత్యానికి విశేషమైన కృషిని గుర్తించి, వార్షిక ప్రాతిపదికన అందజేస్తారు. ఈ సంవత్సరం, సంస్కృతంలో రెండవసారి, ఐదవసారి ఉర్దూలో ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ గౌరవప్రదమైన సన్మానం రూ. 21 లక్షల నగదు బహుమతితో పాటు వాగ్దేవి విగ్రహం, ప్రశంసా పత్రాన్ని కలిగి ఉంటుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రాయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ గ్రహీతలను ఎంపిక చేసింది.