వైసీపీకి పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. తన మనసులోని మాటను బహిరంగంగానే బయటపెట్టారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఆయనకు ఎంపీ సీటుపై భరోసా రాలేదు. సీఎం వైఎస్ జగన్ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వేమిరెడ్డి సన్నిహితులు చెబుతున్న మాట. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
ఇక ఆయనతో పాటు సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా పాలకమండలి అధ్యక్షరాలి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే ఈ విషయాలను ఆయన ప్రస్తావించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పు సమయంలోనూ తనతో సంప్రదించలేదనే అసంతృత్తి వేమిరెడ్డిలో ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. పేరుకే వైఎస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని ఆయన పలు సందర్భాలలో వాపోయారు. సీఎం వైఎస్ జగన్ తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని సన్నిహితుల వద్ద తన గోడును వెల్లిబుచ్చుకున్నారు.
అలాగే నెల్లూరు నగర సమన్వయకర్త బాధ్యతలు ఎండీ ఖలీల్ కు అప్పగించిన సమయంలోనూ తనకు ఆ విషయం చెప్పలేదని ప్రభాకర్ రెడ్డి మనస్థాపం చెందారని, అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారని సన్నిహితులు చెప్పారు. ఇక పార్టీని వీడకుండా ఉండేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వైసీపీ పెద్దలు చర్చలు జరిపారు.
కానీ అటు నుంచి స్పందన లేకపోవడంతో వైసీపీ సభ్యత్వానికి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ లేఖను సీఎం వైఎస్ జగన్ పంపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.