మానవ సహిత అంతరిక్ష పరిశోధనల దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్‌ను సిద్ధం చేసింది. ఈ ఇంజిన్‌కు సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది.
ఇస్రో ఈ ప్రయోగం ద్వారా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. వ్యోమగాములను దాదాపు 400 కి.మీ. ఎత్తైన కక్ష్యలోకి చేర్చి.. తిరిగి వారిని భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలి. ఈ ప్రయోగం 3 రోజుల పాటు జరుగనుంది. వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది.
మహేంద్ర గిరి లోని ఇస్రో లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ కేంద్రంలో ఈ పరీక్ష జరిగింది. మొత్తం నాలుగింటిని 39 సార్లు మండించి, వాటి పనితీరును అంచనా వేశారు. ఇది దాదాపు 8810 సెకన్ల పాటు జరిగింది. వాస్తవానికి ప్రమాణాల ప్రకారం 6,350 సెకన్లు మండిస్తే చాలు. అంతకంటే ఎక్కువ సమయమే మండించి సామర్థ్యాన్ని పరీక్షించినట్లు ఇస్రో వెల్లడించింది.
‘మిషన్ గగన్‌యాన్‌కు సంబంధించి ఇస్రోకు చెందిన సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ మానవసహిత ప్రయాణానికి అనువైనదిగా రుజువైంది. ఇది కఠిన పరీక్షలను ఎదుర్కొంది’ అని ఇస్రో పోస్ట్ చేసింది. రాకెట్ ఇంజిన్లలో హ్యూమన్ రేటింగ్ అనేది కీలకం. మనుషులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఆ యంత్రాలు ఏ మేరకు సరిపోతాయో ఈ ప్రక్రియలో అంచనా వేస్తారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జరగనున్న మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టుకు అవసరమైన వాటికి యాక్సెప్టెన్సీ టెస్ట్‌లు కూడా పూర్తి చేసినట్టు ఇస్రో పేర్కొంది.