తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఈ విషయంలో దాపరికం లేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బిజెపితో మాట్లాడుతున్నామని, పొత్తు గురించి త్వరలోనే ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
కాగా, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతోన్న టీడీపీ, జనసేన పార్టీలు గురువారం జరిపిన సమన్వయ కమిటీ సమావేశంలో తొలి ఉమ్మడి బహిరంగసభను ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరపాలని నిర్ణయించారు. ఈ బహిరంగసభలో రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
టిడిపి – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. పొత్తును స్వాగతించిన టిడిపి -జనసేన కేడర్‌ను అభినందిస్తూ తీర్మానం చేశారు. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసిందని తెలిపారు.
సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొనే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఈనెల 28న తాడేల్లిగూడెంలో నిర్వహించనున్న బహిరంగ సభపై చర్చించారు.
ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు విభేదాలు లేకుండా పనిచేసేలా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని, త్వరలో విడుదల చేస్తామని సమావేశం ముగిసిన తర్వాత అచ్చెన్న మీడియాకు తెలిపారు.
ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పొత్తులు పెట్టుకొనే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని, టికెట్లు కోల్పోయిన వాళ్లు బాధపడొద్దని అధినేతలిద్దరూ చెప్పారని గుర్తు చేశారు. టిడిపి- జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు వారిపై ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాలంటీర్ల గురించి మాట్లాడిన మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
కలిసి పని చేసే సమయం ఆసన్నమైందని, విపక్షాల ఓటు చీలకూడదనే ఏకైక లక్ష్యంతో ఈ పొత్తు పెట్టుకుంటున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంతేకాదు, ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తామని, 500 మంది ప్రత్యేక అతిథులు, ఆరు లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నట్టు మనోహర్ వెల్లడించారు. ఇక టికెట్లు, సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు.