సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను దవాఖానకు తరలించారు.
ఈనెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యనందిత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో నార్కట్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడవకముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.
ఓఆర్ఆర్పై పటాన్చెరు నుంచి మేడ్చల్ వెళ్తున్న క్రమంలో సుల్తాన్పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె స్పాట్లోనే మృతి చెందారు. లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొట్టటంతో విషాదం చోటుచేసుకుంది. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
నార్కట్‌పల్లి ప్రమాదంలో ఆమె కారు దెబ్బతినగా.. ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశారు. ఆ కారు కూడా ప్రమాదానికి గురికావటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు.
గత ఏడాది ఫిబ్రవరి 19న ఆమె తండ్రి, కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించారు. దీంతో 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య నందితకు కంటోన్మెంట్ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో 17 వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లోపే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.