లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 13 తర్వాత వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే షెడ్యూల్ విడుదల కానుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం బృందం తమిళనాడులో పర్యటిస్తోంది. ఆ తరవాత యూపీ, జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది.
వచ్చే నెల మార్చి 13లోగా ఈ పర్యటనలు ముగించుకుని ఆ వెంటనే పోలింగ్ తేదీలు విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది ఈసీ. రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వరుస భేటీలు నిర్వహించి.. పలు ప్రాంతాల్లోని సమస్యలు, ఈవీఎమ్‌లు తరలించేందుకు ఎదురయ్యే సవాళ్లు, ఇతరత్రా భద్రతా పరమైన సమస్యలపై చర్చిస్తొంది.
ఇక, ఈ సారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే వాటిని తొలగించేందుకు ఈ ఎఐ బృందం సిద్ధంగా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ డివిజన్‌ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇలాంటి పోస్ట్‌లను తొలగించినప్పటికీ పదే పదే వాటిని ప్రచారం చేసినా… ఈసీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.