అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూల్ జిల్లాకు చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కేసు విషయంలో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు లేనందున ఆమె మరణానికి కారణమైన అధికారిపై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకచింది.
ఈ తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించిన్నట్లు సీటెల్‌లోని భారత దౌత్య కార్యాలయం ధ్రువీకరించింది. ”దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం” అని దౌత్య కార్యాలయం తెలిపింది.
అంతేకాదు, ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తీర్పుపై సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని పేర్కొంది. సీటెల్ పోలీస్ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని, అప్పటిదాకా కేసు పురోగతిని పరిశీలిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) అమెరికాలోని సియాటెల్ లో మాస్టర్స్ చేస్తుంది. గతేడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వెళ్లబోతూ రోడ్డు దాటుతున్న ఆమెను ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఆ వేగానికి వంద అడుగుల ఎత్తులో ఎగిరిపడి తీవ్రంగా గాయపడి జాహ్నవి మృతి చెందింది. ఆ సమయంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని నిర్థారణ అయ్యింది. సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు.
ప్రమాదం గురించి పై అధికారికి సమాచారం చేరవేస్తూ ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు జాహ్నవి జీవితానికి పరిమితమైన విలువ ఉందని, పరిహారంగా కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని, చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు.
ఈ వ్యవహారం వీడియోతో సహా బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అవమానించేందుకు అలా మాట్లాడలేదంటూ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు ఆర్డరర్. అంతేకాదు జాహ్నవి మృతికి కారణమైన కెవిన్‌కు అనుకూలంగా తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు కూడా.
పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ నిర్లక్ష్యం, కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది. అయితే, ఈ ప్రమాదంలో కెవిన్ డేవ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని, అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోలేమని అక్కడి కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుపై జాహ్నవి కుటుంబ సభ్యులు, సియాటెల్ లోని జాహ్నవి స్నేహితులతో పాటు భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ తీర్పుపై రివ్యూ కోరింది.