సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దుచేయాలని లేదా ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని ఆమె తెలిపారు. ఒకవేళ సీబీఐకి తన నుంచి ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు, సమాచారం కావాలనుకుంటే వ ర్చువల్ పద్ధతిలో హాజరవుతానని స్పష్టంచేశారు.
తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీచేయడం సబబు కాదని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు పూర్తి విరుద్ధంగా తాజా నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. గతం లో (2022, డిసెంబర్)లో అప్పటి ఐవో (విచారణ అధికా రి) సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 41ఏను ఏ పరిస్థితుల్లో జారీ చేశారో స్పష్టత లేదని పేర్కొన్నారు.
అసలు సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఎందుకు జారీ చేశారని కవిత ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీచేయడంపై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా, తనకున్న ప్రజాస్వామిక, రాజ్యాంగహక్కుకు భంగం కలిగించడంలో భాగంగానే సీబీఐ నోటీసు జారీ చేసిందని ఆమె ఆరోపించారు.
తనపై సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్రలేదని, పైగా కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నదని ఆమె గుర్తుచేశారు. గతంలో ఈడీ తనకు నోటీసులు జారీ చేసిన సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించానని, ఈ కేసు పెండింగ్లో ఉన్నదని వివరించారు. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని, ఇది సీబీఐకి కూడా వర్తిస్తుందని ఆమె స్పష్టంచేశారు.
గతంలో సీబీఐ బృందం హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించిన విషయాన్ని ఉదహరించారు. 15 నెలల విరామం తరువాత ఇప్పుడు సీబీఐ విచారణకు పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న ఆరు వారాలపా టు పార్టీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నదని, ఈ కారణాల రీత్యా ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని ఆమె తెలిపారు. కావున తనకు ఇచ్చిన నోటీసులను నిలిపేయాలని కోరారు.