రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఓ దశలో టీమిండియా 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును.. శుభ్ మాన్ గిల్, ధ్రువ్ జురెల్ ఆదుకున్నారు.
వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించి టీమిండియా విజయాన్ని అందించారు. గిల్ 52, జురెల్ 39 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 55, యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేశారు. రజత్ పాటిదార్ (0), రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు.
టర్నింగ్ పిచ్‌పై యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్(52 నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్)లు స్టోక్స్ సేనకు పరీక్ష పెట్టారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో 192 పరుగుల ఛేదనలో 5 వికెట్ల తేడాతో భారత్ విజయ ఢంకా మోగించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు, రూట్ 1, టామ్ హార్ట్ లే 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేయగా, టీమిండియా 307 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు 145 పరుగులకు కుప్పకూల్చారు. అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తాచాటారు. కాగా ఇరుజట్ల మధ్య నామమాత్రమైన చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.