పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా సిఎంగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పిఎంఎల్-ఎన్) పార్టీ అభ్యర్థి మర్యమ్ నవాజ్ చరిత్ర సృష్టించారు. ఆమె పంజాబ్ అసెంబ్లీలో తన ప్రత్యర్థి సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (ఎస్ఐసి)కి చెందిన రాణా అఫ్తాబ్‌పై ఆమె విజయం సాధించింది. అసెంబ్లీలో ఎస్ఐసి సభ్యుల బహిష్కరణ కారణంగా రాణా అఫ్తాబ్‌కి ఒక్క ఓటూ పడలేదు. దీంతో 220 ఓట్లను సాధించి పూర్తి మెజారిటీతో మర్యమ్ సిఎంగా ఎన్నికయ్యారు.
కాగా, ఈరోజు కొత్తగా ఎన్నికైన స్పీకర్ మాలిక్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన జరిగిన పంజాబ్ అసెంబ్లీ సెషన్లో సున్నీ ఇత్తెహద్ కౌన్సిల్ (ఎస్ఐసి)కి చెందిన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని వాకౌట్ చేశారు. అసెంబ్లీని బహిష్కరిస్తున్న సభ్యులను తిరిగి అసెంబ్లీకి వచ్చేలా ఒప్పించేందుకు స్పీకర్ ఖాన్ ఖవాజా సల్మాన్ రఫీక్, సల్మాన్ నజీర్, సమీవుల్లా, ఖలీల్ తాహిర్ సింధులతో సహా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
సిఎం అభ్యర్థిగా మర్యమ్ నవాజ్‌ని స్పీకర్ ప్రకటించారు. అయితే పిఎంఎల్-ఎన్ పార్టీకి అసెంబ్లీలో తగినంతమంది సభ్యుల మెజారిటీ ఉండడం వల్ల ఆమె తన ప్రత్యర్థి రాణా అఫ్తాబ్‌పై గణనీయమైన మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు. మర్యమ్ నవాజ్ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ కుమార్తె. 1992లో ఆమె సఫ్దర్ అవాన్‌ను వివాహం చేసుకున్నారు.
సఫ్దర్ పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేశాడు. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అతని భద్రతా అధికారిగా ఉన్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. 2012లో మర్యమ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2013లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.
2013లో ఆమె ప్రధానమంత్రి యువజన కార్యక్రమానికి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అయితే ఆమె నియామకాన్ని సవాల్ చేయడంతో 2014లో ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. 2024 పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మొదటిసారిగా నేషనల్ అసెంబ్లీకి, పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.