వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ మొదటి గ్యారంటీ ప్రకటించింది. ‘ఇందిరమ్మ అభయం’ పేరుతో మొదటి గ్యారెంటీని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని ప్రకటన చేశారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘న్యాయ సాధన’ సభ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొంటూ ప్రధాని మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ బలహీనం అయిందంటున్నారని చెబుతూ అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకు కూల్చుతున్నాడని మండిపడ్డారు.
అంతేకాకుండా.. ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నియంత మోదీ వల్లనే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని ధ్వజమెత్తారు. మరోవైపు.. రాహుల్, సోనియా గాంధీపై తిట్ల దండకం చేస్తున్నారని.. తనను కూడా వదలడం లేదని విమర్శించారు.
దేశం అంతా అభివృద్ధి చేసింది తానేనని మోడీ అంటున్నారని.. ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ కాదా? అని ఖర్గే ప్రశ్నించారు. దేశానికి మోడీ చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. మోడీ ధనికుల కోసమే పని చేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు.. రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ అంటే భయం పడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో దివంగత రాజశేఖరరెడ్డి ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేశారని చెబుతూ ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా దూసుకు పోతున్నాయని… చంద్రబాబు, జగన్ ల పదేళ్ల పాలనలో ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని షర్మిల విమర్శించారు.
పదేళ్లలో పట్టుమని 10 ఉద్యోగాలు కూడా రాలేదని చెబుతూ ప్రత్యేక హోదా జగన్ తోనే సాధ్యమని ప్రజలు నమ్మితే… అధికారాన్ని అనుభవిస్తూ ఆయన ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని విమర్శించారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో దీక్షలు చేయలేదని, రాజీనామాలు చేయలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడూ ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదని ఆమె విమర్శించారు.
మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. వీరిద్దరి పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. ఈ 10 ఏళ్లలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదని, పదేళ్లలో పట్టుమని 10 ఉద్యోగాలు కూడా రాలేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు వేగంగా అభివృద్ధిలో దూసుకు పోతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కు నెట్టిన ఘనత చంద్రబాబు, జగన్‌ది అని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.
.