గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్లో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చిన పోలీసులు, ఆయనను 8 వ నిందితుడిగా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పార్టీ జరిగిన రూమ్‌లో క్రిష్ అరగంట పాటు కూర్చున్నాడని, డ్రైవర్ లేని సమయంలో వివేకానందతో కాసేపు మాట్లాడారని తెలిపారు. అయితే, హోటల్ యజమానితో తనకు అప్పుడే పరిచయం ఏర్పడిందన్న క్రిష్ చెప్పినట్టు తెలుస్తోంది.
దీనిపై దర్శకుడు క్రిష్ స్పందిస్తూ తాను రాడిసన్ హోటల్‌కు వెళ్లినట్టు తెలిపారు. సాయంత్రం స్నేహితులను కలవడానికి వెళ్లానని, అరగంట పాటు గడిపానని చెప్పారు. పోలీసులు తనను ప్రశ్నించారని, ఎందుకు వెళ్లానో.. ఎవర్ని కలిశానో స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పారు. డ్రగ్స్ కేసులో బీజేపీ నేత కుమారుడు గజ్జల వివేకానంద, వ్యాపారవేత్త కేదార్‌నాథ్‌లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో సినీ నటి లిషి గణేష్, శ్వేత పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో ఆమెతోపాటు మరో సెలబ్రేటి శ్వేతా పేరును కూడా నమోదుచేశారు. గతంలో లిషి గణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూట్యూబర్స్‌గా లిషి గణేష్, సుసితా ఫేమస్ అయ్యారు. లిషి గణేష్‌ను కూడా పిలిచి విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.
నిందితుడు వివేకానంద రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ ఇచ్చాడని, లిషి కూడా వెళ్లిందని గుర్తించామన, ఆమెను కచ్చితంగా పిలిచి విచారిస్తామని కూడా చెబుతున్నారు. జియోమెట్రీ బాక్స్ లాంటి షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ఆమె ఓ గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వీడియోలతోనూ ఆమె యూజర్లను అలరిస్తుంటారు.
ఇక.. 2022లో సంచలనం సృష్టించిన మింక్ పబ్ డ్రగ్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండించింది. తాము చీజ్ బజ్జీలు తినడానికి వెళ్లామంటూ ఓ ఇంటర్వ్యూ లో పేర్కొంది. అంతే.. ఆమెను తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్ పేరు రాడిసన్ డ్రగ్స్ కేసులో వినిపించడం గమనార్హం.
ఆదివారం రాత్రి పక్కా సమాచారంతో పోలీసులు.. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఇక, హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలు ఆగడాలను అడ్డుకోడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు, మెరుపు దాడులు నిర్వహిస్తున్నా.. పోలీసుల కళ్లుగప్పి నగరంలోకి డ్రగ్స్‌ను తీసుకొస్తున్నారు.