మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి, పఠాన్ చెరువులలో జరిగిన బహిరంగసభలలో మాట్లాడుతూ ‘‘కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పామని. చేశామా? లేదా? అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట చేస్తామని చెప్పాం.. చేశామా? లేదా?.. మోదీ ఇచ్చిన గ్యారెంటీ.. నెరవేరిందా? లేదా?’’ అని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశంగా భారత్ ఎదుగుతోందని చెబుతూ ‘‘ఇప్పుడు మీకు మరో గ్యారెంటీ ఇస్తున్నా. కొన్నేండ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతా.. మీకు మాటిస్తున్నా. ఇది మోదీ గ్యారెంటీ” అని ప్రకటించారు.
“మోదీని తిట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే.. వారికి సంబంధించిన వేల కోట్ల అవినీతిని ప్రశ్నించినందుకు తిడుతున్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు.. కుటుంబ పాలనపై ప్రశ్నించినందుకు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు” అంటూ ధ్వజమెత్తారు.
జమ్ము కశ్మీర్ నుంచి మొదలు తమిళనాడు వరకు కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని, ఆయా రాష్ట్రాలు మాత్రం అధోగతి పాలవుతున్నాయి ప్రధాని విమర్శలు గుప్పించారు. “కుటుంబ పాలనను మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకే మాపై వారు విమర్శలు చేస్తున్నారు. నేను కుటుంబ పాలనపై ప్రశ్నిస్తుంటే.. వారు మాత్రం నాకు కుటుంబం లేదని నాపై విమర్శలు చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబ పాలన చేసే వారికి దొంగతనం చేసేందుకు లైసెన్స్ ఇచ్చారా? కబ్జా, అవినీతి చేసేందుకు లైసెన్స్ ఇచ్చారా? అని ప్రధాని ప్రశ్నించారు. ఒక్కో కుటుంబంలో 50 మంది వరకు దోచుకుతింటున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? మోదీపై మా యుద్ధం కొనసాగిస్తామని చెబుతున్నారు. మోదీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా? అంటూ ప్రధాని మండిపడ్డారు.
కుటుంబ పార్టీలన్నీ తమ కుటుంబమే ఫస్ట్ అనుకుంటాయి.. కానీ మోదీకి మాత్రం నేషన్ ఫస్ట్. వారికి వారి కుటుంబమే ముఖ్యం.. కానీ నాకు దేశ ప్రజలంతా ముఖ్యం. కుటుంబ పార్టీలు నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నాయి. కానీ నేను అలా కాకుండా నాకు వచ్చిన గిఫ్టులను దేశ అభివృద్ధి కోసం వేలం వేస్తున్నా.. గంగా మాత సేవ కోసం ఉపయోగిస్తున్నా అని మోదీ తెలిపారు.
“నేను మీ సేవకుడిని. నాకు కూడా కుటుంబం ఉంటే.. నాకు వచ్చిన గిఫ్టులను, వేలం ద్వారా వచ్చిన డబ్బులను నేను పట్టుకెళ్లేవాడినేమో.. కుటుంబ పార్టీలకు చెందిన కొందరు నేతలు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశారు. వారు తమ కుటుంబం కోసం కోటలు కట్టించుకున్నారు. కానీ మోదీ ఇప్పటి వరకు తన కోసం ఒక్క ఇల్లును కూడా కట్టించుకోలేదు. కానీ ఇండ్లు లేని పేదల కోసం 4 లక్షల కోట్ల ఇండ్లను నిర్మించాడు” అని వివరించారు.
కుటుంబ పార్టీలు భూమి నుంచి ఆకాశం వరకు దేన్నీ వదలకుండా దోచుకున్నారు. కానీ మోదీ మాత్రం భుమి, ఆకాశం మాత్రమే కాకుండా పాతాళం వరకు ప్రతీ ఒక్క అవకాశాన్ని దేశాభివృద్ధి కోసమే చేస్తున్నారు. 140 కోట్ల మంది దేశ ప్రజలు మోదీ కుటుంబ సభ్యులే.. కాంగ్రెస్, ఇండియా కూటమి వాళ్లకు ఇంకా తెలియడం లేదు.. మోడీని దేశమంతా తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా నేనే మోదీ కుటుంబమని చెబుతున్నారని ప్రధాని వెల్లడించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు కేటాయించిందని ప్రధాని తెలిపారు. నిరుద్యోగ యువకుల కల నెరవేర్చడంలో తీవ్రంగా కృషి చేస్తోందని చెబుతూ వారి కలలను నిజం చేయడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న దానితో పోల్చుకుంటే ఈ పదేండ్లలో దళిత, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పదేళ్లలో ఎంతో చేశామని పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ల కోసం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశామనిచెప్పా రు.
తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి కారణంగా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అని ప్రధాని స్పష్టం చేశారు. నాణేనికి ఒక వైపు కాంగ్రెస్ అయితే మరోవైపు బీఆర్ఎస్. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం ఉంది. బీఆర్ఎస్ చేసిన కాళేశ్వరం అవినీతిని బయటపెట్టకుండా, విచారణకు ఆదేశించకుండా కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అవినీతి బంధాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుతోందని ప్రధాని ఆరోపించారు.
కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని, అయితే.. కాంగ్రెస్ ఎన్ని రోజులు బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుతోందో చూస్తాం అంటూ ఎద్దేవా చేశారు. అది ఎక్కువ రోజులు నిలవదని స్పష్టం చేశారు. ‘‘అబ్ కీ బార్.. 400 దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలి’’ అంటూ తెలుగులో ప్రధాని మోదీ తెలుగులో వ్యాఖ్యానించారు.