రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఆయనను గులాబీ పార్టీ నేతలు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
దేశంలో సెక్యులర్ విలువలు క్షీణించడం, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీన పడటం, దళిత, నిమ్నవర్గాల అభ్యున్నతి తదితర అంశాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో బీఎస్పీతో కలిసి పనిచేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరంలేదని కేసీఆర్ స్పష్టంచేశారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని, ప్రజా సమస్యలపై కూడా కలిసి పోరాడుదామని సూచించారు. తమ పార్టీ అధిష్ఠానం సైతం బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగానే ఉన్నదని ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలన్నదే తమ పార్టీ లక్ష్యమని, పార్టీ జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలను తీసుకొని పనిచేస్తున్నదని వివరించారు. కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని, సంఘటిత శక్తితోనే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాకుండా భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారం, ప్రచారవ్యూహం తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలోనే మరోసారి రెండుపార్టీల నేతలు భేటీ కానున్నారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోనే కాదు దేశంలో కూడా సెక్యులరిజం ప్రమాదంలో ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి, రాజ్యాంగాన్ని సైతం రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సెక్యులర్ భావాలు కలిగిన, సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన బీఆర్ఎస్, కేసీఆర్‌తో సమావేశమైనట్టు వివరించారు. ఈ భేటీకి మాయవతి ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ కూడా బీజేపీ మాదిరిగానే మారుతున్నదని, ఆ రెండు పార్టీల ముప్పు నుంచి తెలంగాణను కాపాడటానికి బీఎస్సీ, బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయని తెలిపారు. తమ పొత్తును తెలంగాణ ప్రజలు అస్వాదిస్తారని, ఆశీర్వదిస్తారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులు సంతోషంగా లేరని, ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కాకముందే రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.
కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ సిద్ధాంతపరంగా అనేక విషయాల్లో రెండు పార్టీల మధ్య సారుప్యత ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితబంధు అమలు, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు, వెనకబడినవర్గాలు, బలహీనవర్గాల అభ్యున్నతికి అనేక పథకాలను అమలుచేసిన చరిత్ర ఉన్నదని వివరించారు. వీటన్నింటిని చూసిన తర్వాతనే బీఎస్పీ నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఇద్దరం కలిసి చర్చించుకున్నామని చెప్పారు.
ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ హైకమాండ్‌తో మాట్లాడారని, కలిసి పనిచేయాలని స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చామని వివరించారు. మిగిలిన విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కొన్ని సీట్లలో బీఎస్పీ, మరికొన్ని సీట్లలో బీఆర్ఎస్ పోటీచేయాల్సి ఉంటుందని, సీట్ల విషయంపై తదుపరి చర్చిస్తామని, త్వరలో మాయావతితో మాట్లాడతానని తెలిపారు.