* బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి
టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం చెల్లిస్తున్న పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తామని, బీసీ సబ్ ప్లాన్ అమల్లో భాగంగా ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున, ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
మంగళగిరిలో నిర్వహించిన ‘జయహో బీసీ’ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు.’బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా వెనకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించాము” అని తెలిపారు.
టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి మరింత ప్రాధాన్యం ఇస్తామని, బీసీలంటే తమ పల్లకీ మోసే బోయీలని జగన్ అనుకుంటున్నారని, బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, సమాజానికి వెన్నెముకలని నిరూపిస్తాం అని ప్రకటించారు.
బీసీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని, పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు. పెళ్లి కానుక పునరుద్ధరించి రూ.లక్ష చొప్పున లబ్ది అందజేస్తామని పేర్కొన్నారు.
మొత్తం పది ప్రధాన అంశాలతో టీడీపీ, జనసేన సంయుక్తంగా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని పది నెలల క్రితమే ప్రకటించిన టీడీపీ తాజా డిక్లరేషన్‌లోనూ చేర్చింది. జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు దారుణ హత్యకు గురయ్యారని, దాడులు, దౌర్జన్యాల నుంచి బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని తెలిపింది. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడతామని వెల్లడించింది.
బీసీ ఉప ప్రణాళిక ద్వారా వారి అభివృద్ధికి ఏటా రూ.30 వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం చేస్తారు. తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ సబ్‌ప్లాన్ నిధులను వారి కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు. వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించిందని ఆరోపించారు.
153 కులాలతో 56 సాధికార కమిటీలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించినట్టు పేర్కొన్నారు . ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఇప్పుడు రూ.3 వేలు ఉన్న పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామని, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గాన్ని చూపించాలన్న ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా రూ.1.50 కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేసే బాధ్యత చేపడతామని వెల్లడించారు.