మనదేశంలో కరోనా సంక్షోభ సమయంలోనూ కోటీశ్వరులు, అత్యంత ధనికులు మరింత సంపద పోగేసుకొని..బిలియనీర్లుగా మారారు. 100 మంది అత్యంత ధనికుల వద్ద రూ.57.3లక్షల కోట్ల సంపద ఉందని ‘ఆక్స్‌ఫాం ఇండియా’ తాజా నివేదిక తెలిపింది.
‘ఇనీక్వాలిటీ కిల్స్’ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం కరోనా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న 2021లో కొత్తగా 40మంది శతకోటీశ్వరుల హోదాను అందుకున్నారు. వీరి సంఖ్య దేశంలో 102 నుంచి 142కు పెరిగింది. శతకోటీశ్వరుల సంపద రూ.30లక్షల కోట్లు పెరిగింది.
రూ.23.14 లక్షల కోట్ల నుంచి రూ.53.16లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే కోవిడ్ సంక్షోభ సమయంలో 4.6కోట్లమంది తీవ్రమైన పేదరికంలోకి కూరుకుపోయారు. దేశ జనాభాలో అట్టడుగున ఉన్న 50 శాతం మందికి జాతీయ సంపదలో దక్కిన వాటా కేవలం 6 శాతం మాత్రమే ఉంది.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, ఆదాయాలు పడిపోయి పేదరికంలోకి వెళ్లిపోయిన జనాల్లో సగం భారత్ నుంచే ఉన్నారు. అత్యంత ధనికులు, శతకోటీశ్వరులపై సంపద పన్ను పెంచాలని ఆక్స్‌ఫాం ఇండియా సూచించింది. వారి సంపదలో 1 శాతం పన్నుగా ప్రభుత్వానికి ఆదాయం లభించినా అది రూ.50 వేల కోట్లు అవుతుందని తెలిపింది.
ఈ మొత్తంతో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించవచ్చునని నివేదిక సూచించింది. దేశంలో 98 మంది అత్యంత ధనికులపై కేవలం 4శాతం సంపద పన్ను వేస్తే, రెండేళ్లు హెల్త్ బడ్జెట్‌కు, 17 ఏళ్లు మధ్యాహ్న భోజనం బడ్జెట్‌కు సరిపోతుందని అంచనా వేసింది.
కాగా, మరోవంక, ఇదే సమయంలో ప్రపంచంలో 10 మంది అత్యంత ధనికుల సంపద రెట్టింపు అయ్యింది. ఈ టాప్-10 సంపద సుమారుగా రూ.52లక్షల కోట్లు (700 బిలియన్ డాలర్లు) నుంచి రూ.111లక్షల కోట్ల (1.5 ట్రిలియన్ డాలర్ల)కు పెరిగింది. ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలో 16 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా శ్వేతజాతియేతర మైనార్టీలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో పేదలుగా మారారని ‘ఆక్స్‌ఫాం’ తెలిపింది.
ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకోడానికి పన్ను విధానంలో ప్రగతిదాయక పద్థతులు అవలంబించాలని, శ్రీమంతుల వద్దనే సంపంద పేరుకు పోకుండా వ్యవస్థాపరమైన అంశాలను సమీక్షించాలని ఈ అధ్యయనం ప్రతిపాదించింది. ఈ విధంగా సమకూరిన ఆర్థిక వనరులను ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత కు మళ్లించాలని అసమానతలు తగ్గించడం విశ్వజనీన హక్కులుగా పరిగణించాలని సూచించింది. దీనివల్ల ఆయా రంగాలు ప్రైవేటీకరణ కాకుండా నిలబడగలుగుతాయని పేర్కొంది.