తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం.
సూర్య కిరణ్ తెలుగులో 2003లో వచ్చిన ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.
మొదట మలయాళంలో కెరీర్‌ను ప్రారంభించిన సూర్య కిరణ్ తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాలను తెరకెక్కించారు. సత్యం, ధన 51 చిత్రాలతో సుమంత్‌ని మాస్ హీరోగా నిలబెట్టారు. దాంతో పాటు తనని తాను దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు.
సూర్య కిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గాను పని చేశారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఇప్పటి వరకు ఆయన ఆరు సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ చిత్రాలున్నాయి. వీటితో పాటు చాప్టర్6, నీలిమలై చిత్రాలను తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగమొగుడు, ఖైదీ, కొండవీటి దొంగ చిత్రాలతోపాటు రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ సినిమాలలోనూ సూర్యకిరణ్ నటించారు.
కెరీర్ తొలినాళ్లలో హిట్ చిత్రాలు తీసినా ఆ తర్వాత.. అనుకున్నంతగా రాణించకపోవడంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్లో రెండో కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చాడు. 2005లో హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. కళ్యాణి సూర్య కిరణ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే, 2016లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.