టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు.
అసైన్డ్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ యల్లమాటి ప్రసాద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో 2020 ఫిబ్రవరి 27న పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. అలాగే నల్లూరు రవికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2020 మార్చి 3న మరోకేసు నమోదుచేసి, పలువురిని నిందితులుగా పేర్కొంది. అమరావతి నిర్మాణంలో అసైన్డ్ భూముల కుంభకోణంలో టిడిపి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ రూ.4,400 కోట్ల స్కామ్ చేసినట్లు ఎపి సిఐడి పేర్కొంది.
టిడిపి ప్రభుత్వం జిఓ నెంబరు 41 ద్వారా మందడం, వెలగపూడి. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లో 1,100 ఎకరాల మేర అసైన్డ్ భూములను సమీకరించినట్లు పేర్కొంది. 2022లో మాజీ మంత్రి నారాయణను నిందితుల జాబితాలో చేర్చింది. సీఐడీ కేసుల్ని రద్దు చేయాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నిబంధనల్ని పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ప్రస్తుతం ఈ కేసు విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. క్రైం నంబర్లు 14/2020, 15/2020 కేసులకు సంబంధించి సీఐడీ.. ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. క్రైం నం. 14/2020లో చంద్రబాబును 40వ నిందితుడిగా పేర్కొంది. మరో 22 మందిని నిందితులుగా చేర్చాలని ఏసీబీ కోర్టులో సీఐడీ డీఎస్పీ మెమో దాఖలుచేశారు.
చంద్రబాబుతోపాటు, నారాయణ, తుళ్లూరు మండలం అప్పటి తహశీల్దార్ సుధీర్‌బాబు, రామకృష్ణ హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ కేపీవీ అంజనీకుమార్‌ను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. అసైన్డ్ భూములను కాజేసేందుకు రికార్డులను కూడా ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపించింది.
అమరావతి రాజధానిలో భారీ భూ దోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్‌తో భూ దోపిడీకి పాల్పడినట్లు సిఐడి పేర్కొంది.
గతేడాది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును 52 రోజులపాటు జైలులో వుంచిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో కేసులో ఛార్జిషీట్ వేయడం పట్ల టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.