బంగ్లా యుద్ధం – 33
డిసెంబరు 1971లో పాకిస్తాన్‌ను ముక్కలు చేయడంతో పాటు, పశ్చిమ దిశలో ఆ దేశంలోకి చొచ్చుకుపోయి, వారి భూభాగాలను మన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా సైనికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా కూడా ఆధిపత్యం ప్రదర్శించ గలిగిన భారత్ ఎప్పటికన్నా ఇప్పుడు సురక్షితంగా ఉన్నదని చెప్పగలమా? ఈ ప్రశ్న రక్షణ రంగ నిపుణులతో పాటు దేశంలోని రాజకీయ, సామజిక రంగాలలో తరచూ తలెత్తుతూ ఉంటుంది.
బాంగ్లాదేశ్ ఏర్పాటు తర్వాత ఒకేసారి రెండు వైపులా నుండి భారత్ పై దండెత్తడం ద్వారా మనకు పెను భద్రతా సవాళ్ళను విసిరే సామర్ధ్యాన్ని కోల్పోవడమే కాకుండా,ఇక భారత్ తో సాంప్రదాయక యుద్దానికి తలపడే సామర్ధ్యాన్ని కూడా పాకిస్థాన్ కోల్పోయింది. దానితో ఉపఖండంలో భద్రతా వ్యవస్థ భారత్ కు అనుకూలంగా మారినట్లు భావించాము.
సాంప్రదాయ సంప్రదాయ యుద్ధంలో భారత్‌తో సరితూగలేమని, చైనా లేదా అమెరికా జోక్యం చేసుకొని భారత్ పై దాడి చేస్తే తమకు అండగా వస్తాయని కూడా ఆశింపలేమని ఈ యుద్ధం పాకిస్థాన్ కు ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. అప్పటి నుండి పాకిస్థాన్ ఉగ్రవాదం, జిహాదీ రాజకీయాలను ప్రభుత్వ విధానంగా మార్హ్సుకొని, భారత్ పై సంప్రదాయేతర హింసను పురికొల్పడంలో మాత్రం తగు విజయం సాధిస్తూ వస్తున్నది.
“పాకిస్తాన్ ఈ విధానాన్ని ఒక సాధారణ ప్రభుత్వ విధానంగా మార్చుకుంది. ముఖ్యంగా 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా జరిగిన జిహాద్ తర్వాత తన కార్యనిర్వహణ పద్ధతిలో సామర్ధ్యం పెంచుకొంది” అని మాజీ దౌత్యవేత్త, మాజీ జాతీయబద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ చెప్పారు.
భారతదేశం ఇప్పుడు ఒక వంక తూర్పులో అనిశ్చిత భవిష్యత్తు ఉన్న దేశాన్ని, మరోవంక పశ్చిమంలో స్వదేశంలో, విదేశాలలో తన విధానాలను అనుసరించి హింసను ప్రయోగించడానికి మరింత కట్టుబడి ఉన్న పాకిస్తాన్‌ను ఎదుర్కొంటోంది.
అదే సమయంలో పరిణామాలకు ఎటువంటి జవాబుదారీతనం లేకుండా, తన దుశ్చర్యలకు ఏమాత్రం బాధ్యత వహింపకుండా ఒక వంక ఆఫ్ఘన్లతో పాటు భారతీయులపై-ముఖ్యంగా కాశ్మీరీలో వ్యవహరిస్తున్నది. పాకిస్తాన్ కట్టడి చేసే విధానాల పట్ల బ్రిటన్ స్పష్టంగా అనాసక్తి చూపింది.
పాక్ పట్ల అమెరికా ఉదాసీనత
పాకిస్థానీ రాజకీయ నాయకత్వంపై ప్రభావం చూపగల సామర్ధ్యం ఉన్నప్పటికీ పాకిస్థాన్ ను కట్టడి చేయడం పట్ల అమెరికా ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఒక వంక తగిన పారదర్శకత లేకుండా అణుసామర్ధ్యం సమకూర్చుకు న్నా, మరో వంక మన దేశంపై సీమాంతర ఉగ్రవాదం ద్వారా ప్రచ్ఛన్న పోరు సాగిస్తున్నా ప్రపంచ దేశాలు దాదాపుగా ఆ దేశం పట్ల ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. అందుకు ఎవ్వరి వ్యూహాత్మక కారణాలు వారికి ఉండవచ్చు.
భారత్ – అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఈ మధ్య కాలంలో విశేషమైన పురోగతి సాధిస్తున్నా, వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు దారితీస్తున్న, రక్షణ, నిఘా,అంతరిక్ష రంగాలలో సహకారం దిశకు చేరుకున్నా పాకిస్థాన్ పట్ల ఉదాసీనంగా ఉండడం అనివార్యంగా అమెరికా భావిస్తున్నది. దక్షిణాసియాలో అస్థిరతకు పాకిస్థాన్ ప్రధాన కారణం అవుతున్నా ఆ దేశాన్ని ఎవ్వరు నిలదీయలేక పోతున్నారు.
పాకిస్థాన్ ను అమెరికా సమస్యాత్మక మిత్రదేశంగా చూస్తున్నది. అబోటాబాద్‌లోని సురక్షిత గృహంలో ఒసామా బిన్‌లాడెన్, పాకిస్తాన్ మిలిటరీ అకాడమీకి కొద్ది దూరంలో నివాసం ఏర్పాటు చేసుకోవడం వెల్లడైన అమెరికా ప్రశ్నించలేక పోయింది. ఒకవంక, తీవ్రవాద వ్యతిరేక పోరాటంకు నాయకత్వం వహిస్తున్నట్లు చెబుతున్న అమెరికా పాకిస్థాన్ ప్రపంచంలో మరే దేశంలో లేనన్ని ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నది.
ఆఫ్ఘానిస్తాన్ లో అమెరికా 20 ఏళ్లపాటు ఆధిపత్యం వహించిన సమయంలో కూడా అక్కడ అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసిన పలు తీవ్రవాద గ్రూపులలో పాటు ఆఫ్ఘన్ తాలిబాన్, హక్కానీ నెట్వర్క్ ఒక పాకిస్థాన్ కేంద్రంగా మారడం చూసాము. బహుశా ఆఫ్ఘానిస్తాన్ ను తిరిగి తాలిబన్ల చేతులలో అమెరికా ఉంచేవిధంగా పాకిస్థాన్ ద్వంద వైఖరి అవలంభించడం ద్వారా వేగవంతం చేసినదని చెప్పవచ్చు.
పాక్ ను ప్రశ్నిపని ప్రపంచ దేశాలు
పాకిస్తాన్ తన బెంగాలీ జనాభాను దారుణమైన అణచివేతకు, అత్యాచారాలకు గురిచేసినా అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని ప్రశ్నించనే లేదు. అందుకు పాకిస్థాన్ పాలకులను బాధ్యులను చేసే ప్రయత్నమే జరగలేదు. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్ ఎన్నో పాఠాలు చేర్చుకొంది. తన వ్యూహాలు, ఎత్తుగడలు మార్చుకొంది.
ఆ కారణంగా ఆ యుద్ధంలో అపూర్వ విజయం సాధించిన భారత్ ఆ తర్వాత `ఆత్మరక్షణ’లో పడే పరిస్థితులకు దారితీయగా, పాకిస్థాన్ మాత్రం తన ఎత్తుగడలను నిస్సంకోచంగా కొనసాగిస్తూ వస్తున్నది.
మారిన పరిస్థితులు, సవాళ్ళను ఎదుర్కొనే దిశలో భారతదేశం రక్షణ వ్యవస్థలో అప్పటి నుండి ఎన్నో సంస్కరణలు తీసుకు రావలసి వస్తున్నది.
మన సైన్యాన్ని, ఆయుధాలను ఆధునీకరణ కావించుకోవడం కోసం పెద్ద ఎత్తున వ్యయం చేయవలసి వస్తున్నది. మన సరిహద్దుల్లో అన్ని వైపులా భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకోవలసి వస్తున్నది. ఒక విధంగా నిత్యం మన సైనికులు పోరాడుతూనే ఉన్నది.
మరోవంక, చైనా సహితం భద్రతా పరమైన సవాళ్ళను విసురుతూనే ఉంది. రెండు వైపులా నుండి ఒకేసారి దాడులు జరిగినా సిద్దపడవలసిన పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలన మనకు భద్రతాపరమైన సవాళ్ళను మరింత తీవ్రతరం చేశాయి.
పైగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు, భారతదేశంలో మత హింసకు పాకిస్థానీలు పెద్దఎత్తున ప్రేరేపిస్తున్న నేపథ్యంలో మన దేశంలో మతసామరస్యం కూడా ప్రశ్నార్ధకరంగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయి.