కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ కావడం తో ఇప్పుడు రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. గత కొద్దీ రోజులుగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్లో మల్లారెడ్డి తో పాటు ఆయన తనయుడు భద్రారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి మంతనాలు జరిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిసింది. ఇవన్నీ చూస్తే అతి త్వరలోనే కేసీఆర్ కు మల్లారెడ్డి షాక్ ఇవ్వనున్నారని అర్ధం అవుతుంది.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిత్యం పరుషమైన వాఖ్యలు చేస్తుండేవారు. సవాళ్లు, విమర్శలతో వార్తలలో నిలిచేవారు..బస్తేనే సవాల్ అటు తొడలు కొట్టిన రోజులుకూడా ఉన్నాయి. అందుకనే రేవంత్ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి కి వరుస షాకులు ఇస్తూ వస్తుంది.
ముఖ్యంగా మల్లారెడ్డి ఫై పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు ఉండడంతో వాటిని బయటకు తీసే పనిలో పడింది కాంగ్రెస్ సర్కార్. మొన్నటికి మొన్న చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటి కళాశాల గదులను కూల్చివేశారు.
గతంలో చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటి కళాశాలలో స్థలాలు ఆక్రమించినట్లుగా ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించిన కలెక్టర్ అధికారులకు కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు.
కలెక్టర్ గౌతం ఆదేశాలతో గండిమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేతలు చేసారు. ఇలా వరుసపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇబ్బందులు వస్తుండడంతో కాంగ్రెస్ లో చేరితేనే రక్షణ లభిస్తుందని మల్లారెడ్డి ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారని వెల్లడవుతుంది.
అయితే, తాను పార్టీ మారడం లేదని, తమ కుటుంబంలో ఎవ్వరు ఎంపీగా పోటీ చేయడం లేదని మల్లారెడ్డి తేల్చిచెప్పారు. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసి రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ప్రకటించారు. బెంగుళూరులో ఓ యూనివర్సిటీ అమ్ముతానని అంటే వెళ్లానని, యూనివర్సిటీ పనుల కోసం డీకే శివకుమార్‌ను కలిశానని చెబుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు అసత్య ప్రచారాలు నమ్మెద్దని మల్లారెడ్డి కోరారు.