పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆమె తలకు గాయమైంది. నుదుటి నుంచి రక్తం కారింది. దీంతో మమతా బెనర్జీని వెంటనే కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది.
తమ పార్టీ చీఫ్ తలకు గాయమైనట్లు తెలిపింది. అలాగే మమతా బెనర్జీ నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మమతా బెనర్జీ కోలుకునేలా అంతా ప్రార్థించాలని కోరింది.
అయితే వ్యాయామం చేస్తూ దీదీ కింద పడిపోవడంతో ఆమె నుదుటికి ఏదో వస్తువు గట్టిగా తగిలినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ రంధ్రం ఏర్పడి రక్తం ధారగా కారుతున్నట్లు ఫోటోను చూస్తే అర్థం అవుతోంది. ఎక్సర్సైజ్ చేస్తుండగా కింద పడి తీవ్ర గాయాలపాలైన దీదీని ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ.. వెంటనే ఆమెను కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తరలించినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి.
మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్విటర్లో తెలిపారు. త్వరగా మంచి ఆరోగ్యంతో దీదీ తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.