మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హంతకుల్ని కాపాడుతున్న వారికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్.షర్మిల, ఆమె సోదరి, వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీత రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం వైసిపి ప్రజాప్రతినిధులు పార్టీ నుండి బయటకు రావాలని వారు కోరారు.
శుక్రవారం కడప నగర శివారులోని జయరాజ గార్డెన్స్‌లో వివేకా ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని స్మారక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తులసిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ తమ్ముడికి ఐదేళ్లుగా న్యాయం జరగని నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఎవరు హత్య చేశారో అప్పుడు తెలియదని, అన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయని, బంధువులే హత్య చేశారని అర్ధమవుతోందని ఆమె చెప్పారు. ‘అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణగా ఉన్నాడని’ ఆమె ఆరోపించారు. చెల్లెలికి న్యాయం చేయాల్సింది పోయి చివరికి ఆమే హత్యచేసిందన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సునీత కుటుంబం హత్య చేసి ఉంటే ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ ‘మీ చిన్నాన్నను చంపిన, చంపించిన వారిని గుర్తించాలి, అది ముఖ్యమంత్రిగా మీ బాధ్యత. అది నేనైనా, నా కుటుంబమైనా తేల్చాలి. నేను చంపినట్లు ఆధారం ఉంటే సిబిఐకి ఇవ్వాలి’ అని జగన్‌ను ఉద్దేశించి చెప్పారు.
అధికారంలో కొనసాగుతూ తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ సాక్షి చైర్మన్ భారతీ గారూ..మీకో విన్నపం. మీ దగ్గర ఆధారాలుంటే సిబిఐకి ఇవ్వండి.’ అని ఆమె హితవు చెప్పారు. వైసిపి పునాదుల్లో వైఎస్ వివేకా, కోడికత్తి శ్రీను రక్తం దాగి ఉందని ఆమె విమర్శించారు. వైసిపి ప్రజాప్రతినిధుల్లా బయటికి రావాలని లేనిపక్షంలో ఈపాపం వారికీ చుట్టుంకుంటుందని ఆమె హెచ్చరించారు.