లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మార్చి 23వరకూ ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ పూర్తయ్యాక కవితను మళ్లీ కోర్టులో హాజరుపరుస్తారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ శనివారం హాజరుపరిచింది. కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతించడం జరిగింది.
కాగా.. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఐటీ, ఈడీ జాయింట్ సోదాలు నిర్వహించిన అనంతరం.. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా పైవిధంగా కోర్టు తీర్పును వెలువరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలక పాత్ర పోషించారని ఈడి అభియోగం మోపింది. ఆప్ పార్టీకి వంద కోట్ల రూపాయలు ముట్టడం వెనుక ఆమెది కీలక హస్తమని పేర్కొంది. ప్రత్యేక కోర్టులో సిబిఐ తరఫున ఎన్.కె. మట్టా, జోయబ్ హుస్సేన్ వాదించగా, కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.
ఇదిలా ఉంటే తనపై చర్యలు తీసుకోవద్దన్న కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం నాడు విచారణకు రానుంది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.