‘అధికారం అందించిన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తున్నా, 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం.. మరోమారు అధికారం అందిస్తే రాత్రింబవళ్లు ఒక్కటి చేసి దేశం కోసం పనిచేస్తా’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన పార్టీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ మార్పునకు గ్యారెంటీ మోదీ అని, రెండు పర్యాయాలు పూర్తి మెజార్టీ ఇచ్చినందుకే దేశంలో అనేక మార్పులు తీసుకువచ్చామని పేర్కొన్నారు.
నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని, దీనంతటికీ కారణం ప్రజలు తనకు అఖండ మెజార్టీ ఇవ్వడం వల్లే సాధ్యమైందని ప్రధాని స్పష్టం చేశారు. మోదీ నోట వచ్చిందంటే అది అయ్యే తీరుతుందని చెబుతూ అది 370 ఆర్టికల్ అయినా, అయోధ్యలో రాంలాల ను తిరిగి ప్రతిష్ఠించుకోవడం వరకు అందరూ చూశారని గుర్తు చేశారు.
దీంతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశాన్ని అభివృద్ధి పథానికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ సార్వత్రికలకు నోటిఫికేషన్ ఇచ్చేకంటే ముందే ప్రజల తీర్పు బిజెపివైపే ఉందని నిరూపించారని, అందుకు ప్రత్యక్ష నిదర్శనం నిన్నటి మల్కాజ్గిరి రోడ్ షో, నేటి నాగర్కర్నూల్ విజయ సంకల్ప సభ నిదర్శనమని చెప్పారు.
‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అనే నినాదంతో దేశ ప్రజలు తమ పార్టీకి జేజేలు పలుకుతున్నారని, తెలంగాణ సమాజం కూడా ఇదే చెబుతోందని మోదీ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల గుండెల్లో బిఆర్ఎస్ పై ఉన్న కోపాన్ని భయంకరంగా చూశానని, తదుపరి దాని పరిణామం కూడా చూశానని ప్రధాని చెప్పారు. నేడు తెలంగాణ ప్రజలు మోదీని తిరిగి ప్రధానిని చేయాలనే సంకల్పంతో ఉన్నారని తెలిపారు.
జన సునామీ చూస్తుంటే మరోసారి భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వస్తామన్నా ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్, కాంగ్రెస్ అనే విసురు రాళ్ల మధ్య నలిగి పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల కలలను నిర్వీర్యం చేశాయని విమర్శించారు. బిఆర్ఎస్ లూటీని ప్రజలు తిరస్కరిస్తే అంతకంటే పెద్ద లుటేరాలు తప్పుడు పథకాలతో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ను దుయ్యబట్టారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ప్రధాని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉండదన్నారు. అవినీతి అంతం కావాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడా కమలం వికసించాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మాట నేరుగా ఢిల్లీకి చేరాలంటే బిజెపి ఎంపిలు అందరూ గెలిస్తే అప్పుడే తాను సమస్యలన్నీ వారి ద్వారా తెలుసుకుని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని లూటీ చేశారు తప్ప, కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణలో కూడా అభివృద్ధి కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదని తేల్చి చెప్పారు.