దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని చెబుతూ భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. తనకు అంత శక్తి వస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.
మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని.. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని మోదీ వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందిని.. మాల్కాజ్గిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. 400 పార్ అంటున్నారని.. ఈ సారి పక్కాగా 400 సీట్లు సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడిందన్న మోదీ… తెలంగాణను దోచుకున్న వాళ్లను తాము వదిలిపెట్టమని హెచ్చరించారు. తమకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని వెల్లడించారు. తెలంగాణలో ఎన్నో వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే.. రాష్ట్రం మరెంతో అభివృద్ధి చెంది ఉండేదని తెలిపారు. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని.. బీజేపీ ప్రభుత్వం మాత్రమే పసుపు రైతులకు మేలు చేసిందని వ్యాఖ్యానించారు.
పదేళ్లపాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుంటోందని విమర్శించారు. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఫైల్స్‌ను పక్కన పెడుతోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మకయ్యాయని, లిక్కర్ స్కామ్‌లోనూ బీఆర్ఎస్ కమీషన్లు తీసుకుందని మోదీ ఆరోపించారు.
ఆ రెండు పార్టీలు తనను దూషించటమే పనిగా పెట్టుకున్నాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి దోచిన డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళ్తున్నాయని చెబుతూ దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణమని స్పష్టం చేశారు.
రాహుల్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా మోదీ విమర్శలు గుప్పించారు. శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన పోరాటం శక్తికి వ్యతిరేకం అని చెప్పారని గుర్తు చేశారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరగబోతుందన్నారు. శక్తిని ఖతమ్ చేస్తామన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నట్లు మోదీ వెల్లడించారు.
చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టామని.. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో.. జూన్ నాలుగో తేదీన తెలుస్తుందని చెప్పారు. తాను భారతమాతకు పూజారిని అంటూ మోదీ వ్యాఖ్యానించారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం రాహుల్ మాట్లాడుతూ హిందూమతంలో శక్తి అన్న పదం ఉన్నదని, ఆ శక్తితో తాము పోరాడుతున్నామని, ఆ శక్తి ఏంటన్నదే ప్రశ్న అని, ఓ రాజు ఆత్మ ఈవీఎంలో ఉన్నదని, ఇది నిజం అని, ఈడీ, సీబీఐ, ఆదాయ పన్నుశాఖ లాంటి సంస్థలపైనే ఆ రాజు ఆత్మ ఉందని రాహుల్ విమర్శించారు.