ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ శాసనసభాపక్షం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ హైదర్‌గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్‌ను అందజేశారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ పార్టీ ఎమ్మె్ల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్పించుకొని ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. ‘నువ్వు కొట్టినావ్ మేము తీసుకున్నాం.. మేము కొట్టినప్పుడు రేవంత్ రెడ్డి.. నువ్వు లేవకుండా పొతావ్.’ అని ఘూటు వాఖ్యలు చేశారు. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే.. తిరిగి నాలుగు అడుగు ముందుకు దూసుకు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
కాగా, ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దాంతో దానంపై అనర్హత వేటు వేయాలని ఇవాళ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి పిటిషన్ ఇచ్చారు. అయితే ఈ పిటిషన్‌పై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం సత్తా చాటింది. అన్ని స్థానాలు కైవసం చేసుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రేవంత్ మంత్రివర్గంలో ఎవరికీ ప్రాతినిథ్యం లేదు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ మంత్రి పదవి ఆఫర్‌తోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా దానంను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ సిద్ధం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.