ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యానికి బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలకు ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మోదీ పాల్గొన్న సభను భగ్నం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్ ఆకాశంలో వెళుతుంటే కింద రోడ్ల మీద పోలీసులు ట్రాఫిక్ ఆపుతారని, దేశ ప్రధాని పాల్గొన్న సభకు భద్రత కల్పించలేదని విమర్శించారు.డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ వైసీపీకి తొత్తుల్లా మారారని, కావాలని సభకు అటంకాలు సృష్టించారని ఆరోపించారు. సభలో పదేపదే మైకులకు అంతరాయం కలిగేలా జనాన్ని నియంత్రించకుండా కుట్రలు చేశారని ఆరోపించారు.
ప్రధాని పాల్గొన్న సభ విషయంలో ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని నిలదీశారు. పల్నాడు ఎస్పీ అనవసరంగా ఖాకీ చొక్కా వేసుకున్నారని, వైసీపీ చొక్కా వేసుకుని తిరగాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ డీజీపీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ శంకర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని, వారిని ఎన్నికలవిధుల నుంచి తప్పించాలని కోరారు.
కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఆదివారం పాల్గొన్న ప్రజా గళం బహిరంగ సభలో పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి అడగడుగునా కనిపించిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రధాని పాల్గొన్న సభలో కీలక పాసుల మీద కనీసం ఎవరి పేరు మీద జారీ అయిందో వారి పేరుగానీ, వివరాలు లేకుండానే ఖాళీవి జారీ చేశారని ఆరోపించారు.
ఖాళీ పాసుల మీద అధికారులు సంతకాలు చేసి ఇచ్చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పోలీసుశాఖ, జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికార యంత్రాంగం తప్పిదమని సభ జరుగుతున్న సమయంలోనూ భద్రతా వైఫల్యాలు, జనాన్ని కంట్రోల్ చేసే చర్యలు ఎక్కడా పోలీసుశాఖ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.