జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్ సభ అభ్యర్థిని ప్రకటించారు. కాకినాడ నుండి పార్టీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ‘టీ టైమ్’ యజమాని ఉదయ్ శ్రీనివాస్ 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం దుబాయ్ లో జాబ్ చేశారు.
2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్ లెట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 3,000కు పైగా టీ టైమ్ ఔట్లెట్లు ఉన్నాయి. టీటైమ్ తో ఏడాదికి రూ.300 కోట్ల టర్నోవర్ ఉంటుందని అంచనా. ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ ఎంపీ బరిలో దించినట్లు తెలుస్తోంది.
మంగళవారం మంగళగిరి పార్టీలో కార్యాలయంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాను ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా ఇక నుంచి పిఠాపురం నుంచే ఏపీ భవిష్యత్ దశ దిశా మార్చేందుకు పనిచేస్తానని ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గంలో మిథున్ రెడ్డి బాగా బాగా తిరుగుతున్నారుగా, మీకేమైనా బంధువులు అవుతారా? అంటూ పవన్ కల్యాణ్ సరదాగా అడిగారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఒక ప్రత్యేక స్థానమని పవన్ కల్యాణ్ చెప్పారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేయమన్నారని, కానీ తాను ఆలోచించానని పేర్కొన్నారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలని అంటూ ఇక్కడ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు.
పిఠాపురంలో తనను ఓడించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెబుతూ ఏదేమైనా అక్కడి నుంచి లక్ష మెజార్టీతో గెలుస్తానని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గం మార్చుకుందామని పేర్కొంటూ ఒక ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేయొచ్చో చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.
2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత విజయం సాధించారని గుర్తుచేశారు. ఆమెను జనసేనలో ఆహ్వానించారు. కేంద్ర నాయకత్వం తనను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరిందని, అయితే తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడమే ఇష్టమని తెలిపారు. ముందు రాష్ట్రం కోసం పనిచేసి ఆ తర్వాత దేశం కోసం చేద్దామని పేర్కొన్నారు.