ఏపీలో భారీ ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం కావడం సంచలనంగా మారింది. విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్‌లో భారీ ఎత్తున కొకైన్ దొరకడం కలకలం రేపుతోంది. డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసిన బ్యాగుల్లో డ్రగ్స్‌ను తరలిస్తుండగా అధికారులు ఈ కంటైనర్ స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్‌పోల్ ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖపట్నం పోర్ట్‌లో ఈ మత్తు పదార్థాలను పట్టుకున్నారు. కొకైన్‌ను ఈస్ట్ సంచులలో కలిపినట్లు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది. మొత్తం సరుకులో ఎంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా కంటైనర్ ఈ నెల 16న విశాఖపట్నం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌కు కంటైనర్ వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించిన యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
కంటైనర్‌లో ఒక్కొక్కటి 25 కిలోల బరువున్న 1,000 బస్తాల ‘డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసిన డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. నార్కోటిక్స్ డిటెక్షన్ మెకానిజమ్‌లను ఉపయోగించి దొరికిన సరుకు డ్రగ్స్ అని ప్రాథమిక పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. మొత్తం సరుకును స్వాధీనం చేసుకున్నామని… ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇక ఎన్నికల వేళ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకటం సంచలనంగా మారింది. ఇప్పటికే విశాఖ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పెద్ద ఎత్తున వీటిని స్వాధీనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకటం చర్చనీయాంశంగా మారింది.