కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన రోజును చీకటి రోజు అని కెసిఆర్ చెబుతుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రులు లిక్కర్ స్కాంకు పాల్పడితే బ్లాక్ డే అవుతుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణానికి తమ కుటుంబానికి సంబంధం లేదని, కేజ్రీవాల్‌కు, ఆ ప్రభుత్వానికి కూడా ఈ కుంభకోణంతో సంబంధం లేదని మాజీ సీఎం కెసిఆర్ చెప్పగలరా? అని నిలదీశారు.
మద్యం వ్యవహారంలో ఆప్ అవినీతికి పాల్పడిందని, వందల కోట్లు చేతులు మారాయని దీనిని తాను ఆధారాలతో నిరూపిస్తానని చెబుతూ కెసిఆర్ కాదని నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. అమరవీరుల స్థూపం వద్దకు వస్తావా? ప్రెస్ క్లబ్ వద్దకు వస్తావా? చెప్పాలని సవాల్ చేశారు. అయినా మద్యం అంశంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చించడం తమకు ఇష్టం లేదని చెప్పారు.
కెసిఆర్ తన కూతురు కవితను అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడలేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినప్పుడు బ్లాక్ డే అంటున్నారని పేర్కొంటూ దీని వెనుక మర్మం ఏమిటో చెప్పాలని కిషన్ రెడ్డి నిలదీశారు. కవిత అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు, బిజెపికి, తెలంగాణకు, తెలంగాణ సెంటిమెంట్‌కు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి చేసిన అవినీతికి సంబంధించి కవితను అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్ర ఉంటనే ఈడీ అరెస్ట్ చేసిందని, ఆమెను దృష్టిలో పెట్టుకొని మద్యం కేసు దర్యాఫ్తు జరగలేదని వివరణ ఇచ్చారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దర్యాఫ్తు జరిగిందని వెల్లడించారు.
బీరు, బ్రాండీ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాధనం దోపిడీ చేస్తే అందుకు అరెస్ట్ చేస్తే అక్రమం ఎలా అవుతుందో చెప్పాలని కిషన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో దోచుకోవాలని భావించారని ఆరోపించారు. బిఆర్ఎస్, ఆప్ నేతలు సానుభూతికోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సామాన్య ప్రజలు, విజ్ఞులు, మేధావులు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.