ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద ఘెరావ్‌కు యత్నించారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘కేజ్రివాల్ జిందాబాద్’ అన్న నినాదాలు ఆ ప్రాంతమంతటా హోరెత్తాయి.
మంగళవారం ఉదయం 10 గంటలకు ఇక్కడి పటేల్ చౌక్ నుంచి బయల్దేరిన ప్రదర్శన తుగ్లక్ రోడ్డు మీదుగా లోక్మాన్య మార్గ్‌లో అత్యంత భారీ భద్రత నడుమ ఉండే ప్రధాని మోదీ నివాసం వైపు సాగింది. ప్రదర్శన పటేల్ చౌక్ వద్దకు చేరుకోగానే ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్లు పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్ కు తరలించారు.
ఆప్ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో ప్రధాని నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని మెట్రో స్టేషన్ల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్‌కు వెళ్ళే, వచ్చే మార్గాలను భద్రతా కారణాలను సాకుగా చూపి మూసివేవేశారు. పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఈ సందర్భంగా ఆప్ ఢిల్లీ శాఖ కన్వీనర్, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ ఢిల్లీని పోలీస్ రాజ్యంగా మార్చివేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకునేవారంతా మోదీ ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.. ఈ నెల 31న ఢిల్లీలో రామ్‌లీలా మైదాన్‌లో మహా ర్యాలీ నిర్వహణకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు.
ఇండియా బ్లాక్ నుండి పలువురు నేతలంతా ఈ ర్యాలీలో పాల్గననున్నారని రారు చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సీనియర్ ఆప్ నేతలు సోమ్‌నాథ్ భారతి, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖి బిర్లా, పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తదితరులు వున్నారు.
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆప్ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆప్ సీనియర్ నేత సోమ్‌నాథ్ భారతి వ్యాఖ్యానించారు. ఎక్స్‌లో పోస్టు పెడుతూ, తనతో పాటు డిప్యూటీ స్పీకర్ రాఖి బిర్లా తదితరులను అరెస్టు చేసినట్లు చెప్పారు.