అధికారం లేని పార్టీలో కొనసాగేందుకు అసహనంగా ఉండే మాజీ మంత్రి దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థిగా తిరిగి గెలుపొందినా ప్రతిపక్షంలో ఉండలేక కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు, వెంటనే సికింద్రాబాద్ నుండి లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, బిఆర్ఎస్ ఎమ్యెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దపడటంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఫిర్యాయింపు నిరోధక చట్టం క్రింద దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఆయనపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పాటు ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని చెప్పారు.
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ మేరకు దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. కాగా ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండు వారాల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన రెండ్రోజులకే దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అయితే, ఆయన పార్టీ మారటంపై ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, దానంపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలోని బృదం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ అంశం స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే.. తాజాగా మరో వ్యక్తి దానంపై ఫిర్యాదు చేయటం చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా.. దానం నాగేందర్‌కు మరో కేసులో హైకోర్టు ఇది వరకే నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది.
జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు కూడా నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది.