బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, పార్టీ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు ఆ పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కేశవ రావుతో పాటు ఆయన కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే పార్టీ మార్పుపై విజయలక్ష్మీతో పాటు కేకే ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. మరోవైపు పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో కేశవరావును గురువారం ఫార్మ్ హౌస్ కు పిలిపించి కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతక్కువ చేశామని ప్రశ్నించినట్టు చెబుతున్నారు.
మార్చి 30వ తేదీన కేశవరావు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు పది మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై అధికారికంగా కేకే కుటుంబం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
కేసీఆర్ తో భేటీ ముగిసిన తర్వాత ఇటీవల తనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కలిశారని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించిందని కే.కేశవరావు తెలిపారు. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత ఇంటికి వెళ్లాలన్న ఆలోచన తనకు కూడా ఉన్నదని కేసీఆర్తో చెప్పినట్టు కేకే వెల్లడించారు.
కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని తెలిపారు. ఒక్క కేసీఆరే కాదు.. పార్టీ నేతలు, కార్యకర్తలు తనను బాగా చూసుకున్నారని పేర్కొన్నారు. తనతో పాటు తన కుమార్తె విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్లోకి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు.
కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఎపిసిసి అధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా పలు పదవులు కూడా అనుభవించారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ తో కలిసి పని చేస్తూ వచ్చారు. పార్టీలో కూడా ఆయనకు అధికా ప్రాధాన్యత లభించింది.
రెండుసార్లు ఎంపీగా (రాజ్యసభ) అవకాశం దక్కింది. రాజ్యసభలో బిఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఉన్నారు. మరోవైపు పార్టీ సెక్రటరీ జనరల్ గా కూడా ఉన్నారు. ఓవైపు కేకే ఎంపీగా ఉండగానే ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా చేశారు.
అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావటంతో పరిణామాలన్నీ మారిపోయాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ నినాదంతో చాలామంది నేతలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కేకేతో పాటు ఆయన కుమార్తె కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
అయితే, కేశవరావు కుమారుడు విప్లవ్ కుమార్ మాత్రం తాను బిఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేకే, విజయలక్ష్మి నిర్ణయంతో తనకు సంబంధం లేదని రాష్ట్ర టీయూఎఫ్ఐడీసీ మాజీ చైర్మన్ విప్లవ్ కుమార్ తెలిపారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, కేసీఆర్ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.