మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. ఆదివారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, ఆయన భద్రత కోసం 10 మంది సాయుధ సీఆర్పీఎఫ్ కమాండోలు ఉంటారని తెలిపింది. ఆదివారం 33 మంది కేంద్ర సిబ్బంది ఆయుధాలతో లోకేశ్ ఇంటికి చేరుకోనున్నారు.
శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకేశ్‌కు ఈ మేరకు సమాచారం వచ్చింది. 2019కి ముందు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత అవసరమని అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది.
ఏవోబీలో మావోయిస్టుల ప్రభావం ఉండటం, చంద్రబాబు కుటుంబానికి వారి నుంచి పలుమార్లు హెచ్చరికలు, ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హత్య చేయడం లాంటి ఘటనలతో లోకేశ్‌కు గత ప్రభుత్వంలో పోలీసులు భద్రత పెంచారు.
అయితే, ఎన్నికల అనంతరం వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం, తదితర పరిణామాలతో లోకేశ్‌కు భద్రత కుదించారు. ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించారు. తర్వాత దానిని ఎక్స్ కేటగిరీకి మార్చారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా పరమైన ఆవశ్యకతను వివరిస్తూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ రాసింది.
అధికార పార్టీ నేతలకు భద్రత పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల భద్రతపై నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఈ అంశం తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రతిపక్షనేతలకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని, దీనిని సరిదిద్దాలని కోరారు. కొన్ని జిల్లాల ఎస్పీలు సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫారసులు లేకుండానే అధికార పార్టీకి చెందిన నేతలకు భద్రత కల్పించారని ఈసీకి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన గన్మెన్లను వెనక్కి తీసుకోవడంతో పాటు భద్రత కల్పించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ సానుకూలంగా స్పందించింది.