కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో = దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిన తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోయే దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు.
ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటించిన కేసీఆర్ రైతులను పరామర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పాత రోజులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం ధ్వజమెత్తారు.
నీరు, కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. రైతుల కష్టాలు చూస్తుంటే చాలా బాధగా అనిపించిందని చెప్పారు. ప్రభుత్వం ముందుగా నీళ్లు ఇస్తామని చెప్పిందని అందుకే రైతులు పంటలు వేశారని, ఇప్పుడు సాగునీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. పంటలు ఎండిపోయి చాలాచోట్ల రైతులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారని, పెట్టుబడులు పెట్టి నష్టపోయామని, తగిన పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు తెలంగాణలో ఏటా 30, 40 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యేది కాదన్న కేసీఆర్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులు దాటిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమ విధానాలతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్ రాష్ట్రానికి పోటీగా నిలిచింద తెలిపారు. ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి ఇప్పుడెందుకు ఈ పరిస్థితి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి కారణం ఎవరు? లోపం ఎక్కడుందని నిలదీశారు.
మిషన్ భగీరథతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటికో నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రంల ఇప్పుడు తాగునీటికి కరువు ఎందుకొచ్చినట్టని ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడా నీళ్ల ట్యాంకర్లే కనిపించలేదని చెప్పారు. తాగునీటికి ప్రత్యేకమైన ప్రణాళిక అమలుచేశామని, కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా నీళ్ల ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ధ్వజమెత్తారు.
“మా ప్రభుత్వ హాయాంలో రూ.35వేల కోట్లతో విద్యుత్ పాలసీ తీసుకొచ్చాం. 7వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని 18వేల మెగావాట్లకు పెంచాం. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా తీర్చిదిద్దాం. 8ఏళ్లు రెప్పపాటు కరెంట్ పోకుండా సరఫరా చేశాం. 5600 మెగావాట్ల పవర్ ను ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కల్పించాం” అని వివరించారు.
ఉన్న కరెంట్ వాడుకునే తెలివి ఈ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో మళ్లీ జనరేటర్లు, ఇన్వెటర్లు, కన్వెర్టర్లు కనిపిస్తున్నాయని చెప్పారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయంకు ఎవరు కారణం? 100 రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఎందుకు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.