లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్తూ ఎక్స్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. కచ్చైతీవును శ్రీలంకకు ఇవ్వడం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని ధ్వజమెత్తారు.
దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను దెబ్బతీసిందని విమర్శించారు. తమిళ జాలర్లను తరచూ శ్రీలంక నేవీ అరెస్ట్ చేస్తుండటం, బోట్లు, ఇతర విలువైన మెషినరీని స్వాధీనం చేసుకుంటుండటంపై మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్న క్రమంలో కచ్చైతీవు అంశం రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉన్నది. తమిళనాడులో ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కచ్చైతీవుపై తాజాగా రేగిన రాజకీయ దుమారంపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే స్పందించింది. శ్రీలంకకు కచ్చతీవు అప్పగింతను తమ పార్టీ వ్యతిరేకించిందని పేర్కొన్నది. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ చెప్పుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలేమీ లేక, ప్రధాని మోదీ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
1974లో కచ్చైతీవు అప్పగింతకు వ్యతిరేకంగా డీఎంకే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టిందని పేర్కొన్నారు. కాగా, కచ్చైతీవు అంశాన్ని మోదీ లేవనెత్తడంపై తమిళనాడు పీసీసీ చీఫ్ కే సెల్వపెరుంతగై ఎదురుదాడి చేశారు. భారత భూభాగాల్లో చైనా ఆక్రమణలు, పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన, పుల్వామా ఉగ్రదాడి, మణిపూర్ అల్లర్లపై మోదీ ఎప్పుడు మాట్లాడుతారని ప్రశ్నించారు.
కచ్చైతీవు అప్పగింతకు సంబంధించిన అధికారిక పత్రాలు, రికార్డులను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తీసుకొన్నారు. అవి ఆ దీవిని శ్రీలంక ఎలా స్వాధీనం చేసుకొన్నదనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కచ్చైతీవుకు సంబంధించిన చట్టపరమైన అంశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయని, దానిపై సార్వభౌమాధికారానికి సంబంధించి స్పష్టత లేదని అప్పటి విదేశాంగ శాఖ నోట్ ఒకటి పేర్కొన్నది.
అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ కచ్చైతీవు జమిందారీ హక్కులను రామనాడు రాజుకు అప్పట్లో అప్పగించిందని, 1875 నుంచి 1948 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ కచ్చైతీవుపై హక్కును కొనసాగించిందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడినట్టు ఆ డాక్యుమెంట్ పేర్కొన్నది.
అయితే కచ్చైతీవు అప్పగింతపై భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక ప్రధాని సేనానాయకేతో అప్పటి మన దేశ ప్రధాని ఇందిరా గాంధీ రహస్యంగా చర్చలు జరిపారని విపక్షాలు ఆరోపించాయి. శ్రీలంక మ్యాప్‌లో కచ్చైతీవు చూపించడంపై స్పందించిన అప్పటి భారత ప్రభుత్వం దీవిని శ్రీలంకకు ఇవ్వలేదని, అది ఒక వివాదాస్పద ప్రాంతమని పేర్కొన్నది. 1974లో కచ్చైతీవును శ్రీలంకకు అప్పగిస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సీఎం కరుణానిధికి తెలియజేసింది.