జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్ధతకు గురయ్యారు. పిఠాపురంలో నాలుగు రోజులుగా ఎన్నికల ప్రహకారంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంకు గురికావడంతో బుధవారం తన ప్రచారాన్ని అక్కడ ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఆయన బుధవారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు తెనాలిలో పవన్ వారాహి యాత్రకు ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు.
కానీ చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా తెనాలి పర్యటనను వాయిదా వేసుకుని ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. పిఠాపురంలో తన ప్రచారం ప్రారంభించిన తర్వాత పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడ్డారు. దీంతో మధ్యలో ప్రత్యేక హెలికాఫ్టర్ లో హైదరాబాద్ వెళ్లి వచ్చారు. ఇప్పుడు పిఠాపురం నుంచి తెనాలి వెళ్లాల్సి ఉండగా.. మరోసారి అస్వస్ధతకు గురయ్యారు.
పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని తెలిపింది. పవన్ కళ్యాణ్ ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతోపాటు ఆ తర్వాత చేపట్టాల్సిన ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేసుకున్నట్లు జనసేన పార్టీ ప్రకటనలో తెలిపింది.
కనీసం రెండు మూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పినట్లు వెల్లడించింది. త్వరలో రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారని పేర్కొంది. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారని జనసేన ప్రకటనలో తెలిపింది. మంగళవారం పదికి పైగా గ్రామాలలో 20 సుమారు కిమీ దూరం జ్వరంతోనే మండుటెండలో పాదయాత్ర చేస్తూ ప్రచారంలో పాల్గొనడంతో జ్వరం తీవ్రమైనదని చెబుతున్నారు.
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. అయినా లెక్క చేయకుండా పవన్ వారాహి విజయ భేరి యాత్ర నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు ఆయన మండుటెండలో ఏకంగా 20 కిలో మీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో నేటి తెనాలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. జ్వరం తగ్గిన వెంటనే తిరిగి పర్యటన కొనసాగించనున్నారు.