ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. కవిత విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు
లో సీబీఐ పిటిషన్ కూడా దాఖలు చేయగా న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కవిత స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు అనుమతివ్వాలని కోరగా అందుకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే విచారణకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి సూచించింది కోర్టు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. దీంతో తీహార్ జైలులోనే కవితను సీబీఐ విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పటంపై కవితను సీబీఐ విచారించనుంది. మరోవైపు బుచ్చిబాబు ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా విచారించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కాగా, గతంలోనూ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వగా ఆమె మాత్రం విచారణకు హాజరుకాలేదు. తాను వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉందని, అది తేలేవరకు విచారణకు హాజరుకానంటూ సీబీఐకి కవిత సమాధానం ఇచ్చింది. కాగా, ఇప్పుడు విచారణకు సీబీఐ న్యాయస్థానాన్ని అనుమతి కోరగా, కేసులో మరింత తీవ్రత పెరగనుంది. ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే జైలులోనే కవితను సీబీఐ విచారించనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కవితను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. కవిత తన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుండగా.. బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం, తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.