ఓవైపు ఎన్నికలు దగ్గరపడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవటం నుంచి మొదలు నేతల వలసలపర్వం ప్రారంభమైంది. పార్టీలోని కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్, బీజేపీలలో చేరిపోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లే పరిస్థితి లేదంటూ వార్తలు వస్తున్నాయి.
దీంతో కేడర్ కూడా నిరాశలో కూరుకుపోతున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ ఇంత దారుణమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేందుకు అసలు కారణాలేంటీ అన్న ఆలోచనలో పరిస్థితి అధిష్ఠానం. అందుకు వాస్తు దోషంగా గుర్తించి టిఆర్ఎస్ భవన్ లో ప్రవేశం, నిష్క్రమణ గేటును మార్చారు.
మరోవంక, తెలంగాణ సెంటిమెంట్‌తో ఏర్పాటైన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లి, ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ, రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వాన్ని రెండు సార్లు ఏర్పాటు చేయటంలోనూ అదే పేరు ఎంతగానో ఉపయోగపడింది. అయితే, టీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు నిర్ణయించుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చారు.
అప్పటి నుండే పార్టీ పతనం ప్రారంభమైనదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాలలో ఇప్పుడు బలపడుతుంది. అదే పార్టీకి పెద్ద దెబ్బకొట్టినట్టుగా కొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పేరులో నుంచి తెలంగాణ పదాన్ని తొలగించటంతో పేరు బంధంతో పాటు పేగు బంధాన్ని కూడా తెంచుకున్నారంటూ ప్రతిపక్షాలు బలంగా వాదిస్తూ రాష్ట్ర ప్రజల్లోనూ ఓ ఆలోచనను రేకెత్తించినట్టు విశ్లేషకులు కూడా చెప్తున్నారు.
ఇక ఈ విశ్లేషణలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న బీఆర్ఎస్ మళ్లీ పార్టీ పేరును మార్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ పార్టీగా మార్చాలని కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ప్రకటన చేశారు.
వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పేరు మార్చే ఆలోచన చేస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు కసరత్తు ప్రాభించినట్లు కీలక ప్రకటన చేశారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదని ఎర్రబెల్లి అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని స్వయంగా క్షేత్రస్థాయి నేతలు అధిష్ఠానం వద్ద మొరపెట్టుకున్న విషయాన్ని ఎర్రబెల్లి గుర్తుచేశారు. టీఆర్ఎస్ పేరుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్ పేరు మార్చగానే అధికారం కోల్పోయిందని పేర్కొన్నారు.