ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాలు ముమ్మరం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తుంటే, ఎన్డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జనసేన ప్రచారంలో వేగం పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలు నిర్వహిస్తుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ భేరీ యాత్ర చేపట్టారు.
ప్రజాగళం ప్రారంభ సభ బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రచారం చేసినా ఆ తర్వాత మూడు పార్టీలు ఎవరి దారిలో వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉమ్మడి ప్రచారానికి రంగం సిద్ధం చేశాయి. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి.
ప్రజాగళం మూడో విడతలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగే సభల్లో వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. 11వ తేదీన పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ఎన్నికల ప్రచారం ఉంటుంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ భేరీ యాత్రలో భాగంగా ఆదివారం అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాలగోన్నారు. సోమవారం ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలో పవన్ పాల్గొంటారు. 9వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించే ఉగాది వేడుకలకు పవన్ కల్యాణ్ హాజరవుతారు.
తీవ్రమైన జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభలకి విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. జ్వరం నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈనెల 14న తెనాలిలో పర్యటించనున్నారు. తెనాలి ఇప్పటికే పర్యటించాల్సి ఉండగా… జ్వరం కారణంగా పవన్ పర్యటన వాయిదా పడింది.