లిక్కర్ కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత వేసిన పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉండటంతో ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు.
ఈడీ, కవిత తరపు న్యాయవాదులు వాడీవేడిగా వాదనలు వినిపించారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది.
ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు… కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఇక ఈనెల 20న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. మరోవైపు రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండటంతో మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.