ఏపీ ఎన్నికల వేళ జనసేన పార్టీకి అండగా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి తోడుగా అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి నిలబడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా బరిలో ఉన్న జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తోంది.
అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని ఇప్పటికే వారాహి విజయభేరి యాత్రల పేరిట ప్రచారం సైతం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తమ్ముడి పార్టీకి మద్దతుగా నిలిచారు మెగాస్టార్ చిరు. అందులో భాగంగానే జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం అందజేశారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కళ్యాణ్‌కు అందించారు.
హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ సమయంలోనే విరాళం చెక్కును చిరంజీవి పవన్ కళ్యాణ్‌కు అందించారు. సోమవారం నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి విశ్వంభర షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు.
ఈ సమయంలో పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. అన్నయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విరాళం చెక్కును పవన్ కళ్యాణ్‌కు అందించారు చిరు. ఆ తర్వాత సోదరులు ముగ్గురూ కొంత సేపు పలు విషయాలపై మాట్లాడుకున్నారు.
మరోవైపు ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టి.వి.లో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి తన తమ్మునికి తన ఆశీర్వాదబలంతోపాటూ ఆర్థికంగానూ అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయల చెక్కును అందించారని జనసేన ట్వీట్ చేసింది. చిరంజీవితో పాటుగా రామ్ చరణ్ సైతం తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారని తెలిపింది.
జనసేన పార్టీని స్థాపించి సుమారు పదేళ్లు కాగా పలుసార్లు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి మాట్లాడారు. అయితే నేరుగా ఎక్కడా జనసేనకు తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించలేదు. అయితే ఎన్నికల సమయంలో జనసేన కోసం ఐదు కోట్ల విరాళం అందించడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తుంది.