ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్, సిట్ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని ఏపీ నుంచి బయటికి పంపింది. ఆయనను అసోంలో ఎన్నికల పోలీసు అబ్జర్వర్‌గా నియమించింది. ఇప్పటికే ఆరుగురు ఐపీఎస్‌లు, ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా కొల్లిని రాష్ట్రం నుంచి దూరంగా… ఈశాన్య రాష్ట్రానికి పంపించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గత ఎన్నికల వరకు ఎన్నికల్లో సాధారణ పరిశీలకులు, వ్య య పరిశీలకులు మాత్రమే ఉండేవారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఈసీ పోలీస్ అబ్జర్వర్లను కూడా నియమిస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులను ఇతర రాష్ట్రాలకు పరిశీలకులుగా పంపించారు. కొల్లి రఘురామిరెడ్డిని అసోంలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలీసు పరిశీలకుడిగా నియమించారు. ఆయన.. గువాహటి కేంద్రంగా ఉండి విధులు నిర్వహిస్తారు.
రఘురామిరెడ్డి రాజధాని భూములపై వేసిన ‘సిట్’కు ఆయనే అధిపతి. ‘స్కిల్’ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన అధికారి ఈయనే. ఇక.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కూడా కొల్లి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను ఔషధ నియంత్రణ మండలి డీజీగా కూడా నియమించారు. సోమవారమే తాడేపల్లి సిట్ కార్యాలయం దగ్గర కొన్ని పేపర్లను దహనం చేయడం కలకలంరేపింది.
అమరావతి భూముల విషయంలో సీఐడీ నమోదు చేసిన కేసులో హెరిటేజ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను తగులబెట్టారని టీడీపీ ఆరోపించింది. అయితే అలాంటిది ఏమీ లేదని.. ఆ డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నాయని సీఐడీ వెల్లడించింది. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.