విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నేత పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో దుమారం చెలరేగింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు ఈసారి ఎన్డీయే పొత్తులో భాగంగా టికెట్ లభించలేదు. దీంతో ఆయన సోమవారం పార్టీకి రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీపైనా తీవ్ర విమర్శలకు దిగారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు.
2019 ఎన్నికల్లోజనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో కూడా టిక్కెట్ వస్తుందని భావించారు. అయితే ఎన్నికల పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును బిజెపికి కేటాయించాల్సి వచ్చింది. బిజెపి అభ్యర్థిగా ఇక్కడి నుండి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా మహేష్ ను నచ్చచెప్పేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది.
స్వయంగా సుజనా చౌదరి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారిద్దరి మధ్య అంగీకారం సాధ్యపడలేదని చెబుతున్నారు. మరోవంక, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి బిజెపి అభ్యర్థి ఓటమికోసం కృషి చేయమని వైసిపి వర్గాలు ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
పోతిన మహేష్ రాజీనామాపై జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. మహేష్ రాజీనామాతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ వీడియో పెట్టారు.
ఇందులో ఆయన.. మహేష్ గారిపై జనసైనికులు, వీరమహిళలు, ప్రజలు నుండి ఫిర్యాదులు వచ్చినా, ఎదుగుతున్న బీసీ నాయకుడు మారతాడని కళ్యాణ్ ఓపిక పట్టారని తెలిపారు. అలాగే ఆయన వైసీపీతో కుమ్మక్కైన విషయం కూడా తెలుసని తీవ్రమైన ఆరోపణ చేశారు.
విజయవాడలో బ్రాహ్మణుడి స్థలం కబ్జా విషయంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి వత్తాసు పలికినప్పుడే ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది అంటూ బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సుజనా చౌదరి వస్తే లేక మరెవరు విజయవాడ పశ్చిమ సీటుకు వచ్చినా మీకు డబ్బులివ్వాలా? ఇలా ఎంతకాలం రాజకీయాలు చేస్తారు? బొలిశెట్టి ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలకు తెరపడుతుందని, మీ పోకతో విజయవాడలో జనసేన బలపడిందంటూ స్పష్టం చేశారు.