ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కీలక హామీ ఇచ్చారు. ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ప్రకటించారు.
ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని.. ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థను తొలగించబోమని బాబు తేల్చి చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారని సీఎం జగన్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని వాలంటీర్లకు సూచించారు. వలంటీర్లలో సమర్ధత, శక్తి ఉన్నాయని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారి భవిష్యత్తును నిర్మిస్తామని తెలిపారు.
వలంటీర్ల జీవితాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యవస్థను ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసి జైలుకుపోయి జీవితాలు పాడు చేసుకుంటారో? రాష్ట్రాభివృద్ధిలో భాగమవుతారో? వలంటీర్లు తేల్చుకోవాలని కోరారు. జగన్ను నమ్మి మోసపోవద్దని, అతను మరలా అధికారంలోకి రారని అన్నారు. జగన్కు సంపద సృష్టించడం చేతకాదని స్పష్టం చేశారు.
సంపద సృష్టించి ప్రజల ఆదాయం తాను పెంచుతానని, అప్పుల భారం లేకుండా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలకు పెంచుతామని, పెంచిన వాటిని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వికలాంగులకు పింఛను రూ.6 వేలకు పెంచుతామని గుర్తుచేశారు. ఇవన్నీ చేయాలంటే కేంద్ర సహకారం అవసరమని చెప్పారు.
ఎస్సి, ఎస్టి, బిసి మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా త్వరలో కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలకు కారం, చేదు మాత్రమే మిగిలాయని విమర్శించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు ఇంకిపోయాయని, జలాశయాల్లో నీళ్లు లేవని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు తాగునీరు ఇవ్వలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారా? అని ప్రశ్నించారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసమే కూటమి ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా వస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతో అవసరమని చెప్పారు.