గాజాలో హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని సిరియాలో హిజ్బుల్లా వ్యతిరేకిస్తున్నందుకుగాను సిరియాలో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసింది. హమాస్‌కు మద్దతు తెలిపేవారిని విడిచిపెట్టే ప్రసక్తేలేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
గాజాలో హమాస్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా దాడులు చేస్తోంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఆ మిలిటెంట్ సంస్థపై వైమానిక దాడులకు పాల్పడుతోంది. తాజాగా బుధవారం ఉదయం మరోసారి హిజ్బుల్లా స్థావరాలను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
ఓ భవనంపై దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. గాజాలో హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని హిజ్బుల్లా చాలాసార్లు వ్యతిరేకించింది. ఐడిఎఫ్ ఆ మిలిటెంట్ గ్రూప్‌పైనా దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ సోమవారం జరిపిన దాడిలో హిజ్బుల్లాలోని ప్రధాన విభాగమైన రాడ్వాన్ ఫోర్సెస్ కమాండర్ అలీ అహ్మద్ హుస్సేన్ మృతి చెందాడు.
సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఈరోజు ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కీలక స్థావరాలు, సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ వేదికగా విడుదల చేసింది.
సిరియా భూభాగంపై జరుగుతున్న అన్ని కార్యకలాపాలకు ఆ దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐడిఎఫ్ తెలిపింది. హిజ్బుల్లా బలోపేతం కోసం మద్దతు ఇచ్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. పరోక్షంగా సిరియా గడ్డ నుంచి హిజ్బుల్లా కార్యకలాపాలకు అనుమతినివ్వొద్దని హెచ్చరించింది.
హిజ్బుల్లాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్‌కు మద్దతు తెలిపేవారిని విడిచిపెట్టే ప్రసక్తేలేదని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున హిజ్బుల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఏప్రిల్ 1 న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లోని ఏడుగురు సభ్యులతో సహా 16 మంది మరణించారని అబ్జర్వేటరీ తెలిపింది. ఈ దాడిపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇక ఇజ్రాయెల్ పై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు కూడా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.