జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడ్డాయని తణుకు వేదికగా బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేస్తామని, దాంతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని, అందుకే పొత్తు పెట్టుకున్నామని వారు తెలిపారు. మధ్య తరగతి ప్రజానీకం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
ఇరుపార్టీల అధినేతలు హెలికాప్టర్లో తణుకులోని పాలిటెక్నిక్ కళాశాలకు, అక్కడి నుంచి రోడ్ షోగా నరేంద్ర సెంటర్లో ఏర్పాటు చేసిన సభకు చేరుకున్నారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కోరారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ భేషరతుగా మద్దతిచ్చారని, ఇది ఎన్నటికీ మర్చిపోనని చెప్పారు. ఓట్లు చీలకూడదనే లక్ష్యంతో పవన్ పని చేస్తున్నారని వివరించారు. కేంద్రం సహకారం అవసరమని బిజెపితో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు.
2014లో మాదిరిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాలు టిడిపి కూటమికి ఇవ్వాలని కోరారు. ఉద్యోగాలు కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కేంద్రం మద్దతు కావాలని, అందుకే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని సమర్థించుకున్నారు.
విధ్వంస పాలన, గంజాయి, డ్రగ్స్ కార్యకలాపాలు, రహదారుల ఛిద్రం, అప్పులు, కల్తీ మద్యం, దళితుల హత్య వంటి వాటిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు.
రైతులు ఆనందంగా లేరని తెలిపారు. గోనె సంచులు ఇవ్వలేని మంత్రి పౌరసరఫరాల శాఖ చూస్తున్నారని విమర్శించారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సూపర్ సిక్స్‌లో భాగంగా మహిళలకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. తణుకులో ఉన్న మంత్రి కారుమూరి రూ.850 కోట్లు టిడిఆర్ బాండ్లలో, పేదలకు ఇళ్ల స్థలాల్లో, కాకినాడ పోర్టుకు బియ్యం రవాణాలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
కూటమి అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తమ తొలి మాటలు మధ్య తరగతి ప్రజానీకంపైనే ఉంటాయని పవన్ కల్యాణ్ తెలిపారు. మధ్యతరగతి ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు రూ.70 వేల కోట్లు పోలీసులకు సంబంధించి టిఎ, డిఎ, సరెండర్ లీవుల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం దోచుకుందని విమర్శించారు.
తాను యువత కోసం పని చేస్తున్నానని, అందుకే పొత్తులో కొంత తగ్గాల్సి వచ్చిందని తెలిపారు. రైతులను ఏడ్పించిన వైసిపి ప్రభుత్వం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలన్నారు. పోలవరం పునరావాసం గురించి అడిగితే సదరు మంత్రి డ్యాన్స్‌లు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి, జనసేన, బిజెపి నేతలు పాల్గొన్నారు.