మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ లకు ప్రయాణం చేయవద్దని భారత పౌరులకు సూచించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ తమ సూచనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులు చేయొచ్చనే వార్తలు వస్తున్న క్రమంలో విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీని జారీ చేసింది.
అలాగే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు సమీపంలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని, తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. ఇరు దేశాల్లో నివసిస్తున్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, అనవసర కదలికలను నియంత్రించాలని సూచించింది.
కాగా, ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఇరాన్ అగ్రశ్రేణి ఆర్మీ జనరల్, మరో ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు. ఈ నేపథ్యంలో ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై దాడికి సన్నద్ధమవుతున్నది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
మరోవంక, ఇజ్రాయెల్‌పై రానున్న 48 గంటల్లో ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని, ఇందుకు ఇజ్రాయెల్ కూడా సన్నద్ధమవుతోందని వాషింగ్టన్ నుంచి వెలువడే ది వాల్ స్రేట్ జర్నల్ శుక్రవారం వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి వల్ల ఎదురయ్యే రాజకీయ పరిణామాలను ఇరాన్ యోచిస్తున్నట్లు ఇరాన్ నాయకత్వానికి సన్నిహితుడైన ఒక వ్యక్తిని ఉటంకిస్తూ జర్నల్ తెలిపింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు కనపడని తరుణంలో తన చిరకాల శత్రువైన ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి సన్నిద్ధం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇ్రజ్రాయెల్పై దాడి ప్రతిపాదన ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా ఖమేనీ ముందు ఉందని, ఇందులోని రాజకీయ ప్రభావాలపై ఆయన యోచిస్తున్నారని ఆయన సలహాదారులలో ఒకరు తెలిపినట్లు పత్రిక పేర్కొంది.
సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇటీవల ఇరాన్ కాన్సలేట్‌పై జరిగిన దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ డాడిలో ఇరాన్ సైనిక జనరల్‌తోపాటు ఆరుగురు సైనికాధికారులు మరణించారు. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది.