ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఆయన సోదరి, ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం జరిపిన పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కడప లోక్ సభ నుండి పోటీచేస్తున్న ఆమె తన పులివెందులలో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా ఆమెకు మద్దతుగా కలిసి ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.
వివేకా హంతకులకు మద్దతిస్తారా, రాజశేఖర్ రెడ్డి బిడ్డకు మద్దతిస్తారా అంటూ షర్మిల విసురుతున్న సవాళ్లపై వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. షర్మిల లింగాల మండలానికి రాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. “అల్లరి చేసే వాళ్లు పులివెందుల రండి. పూల అంగళ్ళ వద్ద పంచాయితీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం” అని షర్మిల ఆవేశంగా మాట్లాడారు.
లింగాల మండలంలో వైఎస్ షర్మిల ప్రచారం చేస్తుండగా.. వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఓడిపోతాడనే భయం వైసీపీకి పట్టుకుందని, అందుకే మమ్మల్ని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. మీరు ఎంతైనా అరుచుకోండి, మాకేం అభ్యంతరం లేదన్నారు.
ఇంకా వైసీపీ నినాదాలు ఆగకపోవడంతో ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో షర్మిల ప్రచారం కొనసాగింది. వైసీపీ శ్రేణుల తీరును షర్మిల తప్పుపట్టారు.
‘అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన అవినాష్ రెడ్డికి ఓటమి భయం ఉంది. తన పర్యటనకు అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలను తీసివేస్తున్నారు. ఒకప్పుడు జగన్‌కి చెల్లెను కాను బిడ్డను.. సీఎం అయిన తర్వాత ఆ బంధం తెగింది. బాబాయిని చంపిన వాళ్ళను పక్కన పెట్టుకున్నారు. మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు అని’ షర్మిల మండిపడ్డారు.
అవినాష్ అంటే తమకు గతంలో కోపం లేదని, కానీ సీబీఐ అతన్ని హంతకుడని తేల్చిందని షర్మిల తెలిపారు. కానీ జగన్ అతనికి శిక్ష పడకుండా కాపాడుతున్నారని విమర్శించారు. జగన్ అవినాష్ కు అండగా నిలబడటం వల్లే తాను పోటీ చేయాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు. అల్లరి చేసే వాళ్లు పులివెందుల పూల అంగడికి వస్తే అక్కడే తేల్చుకుందామని ఆమె సవాల్ విసిరారు. వివేకా కుమార్తె సునీత కూడా తాను చెప్పే దానిలో తప్పుంటే పులివెందుల పూల అంగడికి రావాలని సవాల్ విసిరారు. అక్కడే పంచాయితీ పెట్టుకుందాం రావాలని అవినాష్ రెడ్డిని కోరారు.