ఎన్నికల బాండ్ల రూపంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు వంద కోట్లు ఇచ్చిన మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది.
జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన పనుల విషయంలో మెఘా ఇంజినీరింగ్ కంపెనీకి 174 కోట్ల బిల్లులను క్లియర్ చేయడంలో సుమారు రూ.78 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఎన్‌ఐఎస్‌పీ, ఎన్ఎండీసీకి చెందిన ఎనిమిది మంది అధికారులు, మెకాన్‌కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఇంటిగ్రేటెడ్లోని ఇంటెక్వెల్, పంప్ హౌజ్, క్రాస్ కంట్రీ పైప్‌లైన్ పనులకు సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్ట్‌లో లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై సీబీఐ ఆగస్టు 10, 2023న ప్రాథమిక విచారణ జరిపింది. ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ఆధారంగా లంచం ఆరోపణపై సాధారణ కేసు నమోదు చేయాలని మార్చి 18న సిఫార్సు చేశారు.
మార్చి 21న ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం మెఘా ఇంజినీరింగ్ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుగా రెండవ స్థానంలో నిలిచింది. బాండ్ల రూపంలో అత్యధికంగా బీజేపీకి సుమారు రూ.586 కోట్లను విరాళంగా ఇచ్చినట్టు పేర్కొంది.
ఇదే కంపెనీ బీఆర్ఎస్కు రూ.195 కోట్లు, డీఎంకేకు రూ.85 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.37 కోట్లు, టీడీపీకి దాదాపు రూ.25 కోట్లు ఇవ్వగా.. కాంగ్రెస్‌కు రూ.17 కోట్లు, జేడీఎస్, జనసేన, జేడీయూకు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.